సోమవారం 8 ఫిబ్రవరి 2010

వంగకు బెంగ...


దేశంలో ఎన్నో సమస్యలున్నాయి.. ఓ వైపు ద్రవ్యోల్బణం.. ఆకాశాన్నంటిన రేట్లు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు టెర్రరిజం కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ పక్కన పెట్టి నెలరోజులకుపైగా.. ఓ అంశం దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అదే బీటీ వంకాయ. రెండో రోజుల్లో ప్రభుత్వం.. ఈ బీటీ వంకాయకు అనుమతిచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.
దేశంలో బీటీ బాంబులు పేలుతున్నాయి. ఎక్కడికక్కడ వ్యతిరేక నిరసనలు.. అనుకూల ప్రదర్శనలు. బీటీ వంకాయకు అనుమతి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. బీటీ వంకాయతో దిగుబడులను భారీగా పెంచుకోవచ్చని ఓ వర్గం భావిస్తుండగా.. మరో వర్గం తీవ్రమైన దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని వాదిస్తోంది. ఆరోగ్య సమస్యలతో పాటు.. మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న విత్తన వ్యవస్థ పూర్తిగా బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
బీటీ వంకాయకు దాదాపుగా అన్ని అనుమతులు ఎప్పుడో లభించేశాయి. దేశంలో జన్యుమార్పిడి పంటలు సాగు చేయాలంటే.. అనుమతులు మంజూరు చేయాల్సిన జెనిటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ.. బీటీ వంకాయ ప్రయోగాత్మక సాగుకు గత ఏడాది అక్టోబర్‌ 14నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఎంతలేదు.. అమల్లోకి వచ్చేస్తుందన్న తరుణంలో.. పర్యావరణ మంత్రిత్వ శాఖ వద్ద దీనికి బ్రేక్ పడింది. బీటీ వంగపై.. దేశంలో విస్తృతస్థాయిలో చర్చ జరగలేదని భావించిన కేంద్ర మంత్రి జైరాం రమేశ్.. ఆ ఫైల్‌ను పక్కన పెట్టారు. తొలిసారిగా దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే... ఏడు చోట్ల విస్తృత సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఎక్కడిక్కకడ నిరసనలే జైరాం రమేశ్‌కు స్వాగతం పలికాయి.
బీటీ వంగ విషయంలో దేశం రెండుగా చీలిందని చెప్పొచ్చు. ఒకటి విత్తన కంపెనీలు లీడ్ చేస్తున్న వర్గమైతే.. మరొకటి స్వచ్చంధసంస్థలు నడిపిస్తున్న వర్గం. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ రెండు వర్గాలు తమ వాదన వినిపించడానికి బలమైన ప్రయత్నమే చేశాయి. అనూహ్యలాభాలను అందుకోవాలంటే.. వంగలోకి బీటీని చొప్పించాల్సిందేనని ఓ వర్గం అభిప్రాయపడగా.. కేంద్ర ప్రభుత్వం మోనశాంటో ఏజెంట్‌గా వ్యవహరిస్తుందని మరికొంతమంది రైతులు ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసమే.. ప్రజలదగ్గరకు వచ్చానన్నది కేంద్రమంత్రి సమాధానం. ఇలా దేశవ్యాప్తంగా జైరాం రమేశ్ నిర్వహించిన సమావేశాలు ఫిబ్రవరి 6తో పూర్తైపోయాయి. ఇక నిర్ణయం ప్రకటించడమే మిగిలింది. ఈ నెల పదో తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బీటీ వంకాయకు అనుకూలంగా ఉంటుందా.. లేదా.. వ్యతిరేకంగా వస్తుందా.. ఇదే ఇప్పుడు అందిరినీ వేధిస్తున్న ప్రశ్న.

వంకాయకే బీటీ ఎందుకు?

వంకాయ వంటి కూరయు.. పంకజముఖి సీతవంటి భార్యా మణియున్... శంకరుని వంటి దైవము ... లంకాపతి వైరి వంటి రాజును గలడే అంటూ.. వంకాయ గొప్పదనాన్ని కీర్తించాడు శ్రీనాథ మహాకవి. వంకాయతో చేయగలిగినన్ని కూరలు మరొకదానితో చేయలేమన్నదీ వాస్తవమే. అందుకే.. యుగయుగాలుగా వంకాయ మనవారికి అత్యంత ఇష్టమైన వంటకమై కూర్చొంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా పండించే పంటల్లో మొదటిది బంగాళాదుంప అయితే.. రెండోది వంకాయే. ఏటా 90 లక్షలకు పైగా వంకాయలు మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో మనరాష్ట్రం వాటా దాదాపు 5 లక్షల టన్నులు. పైగా మనదేశంలో దాదాపు వెయ్యిరకాల వంకాయలు లభ్యమవుతున్నాయి. ఇంత వైవిధ్యమున్న కూరగాయ మరొకటి మనకు కనిపించదు.
వంకాయ చూడడానికి అందంగానే ఉన్నా... కళ్లుమూసుకొని కొనుక్కోవడానికి మాత్రం లేదు. ఏ కాయలో పుచ్చు ఉంటుందో ఏమాత్రం చెప్పలేం. దీనికి కారణం.. ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ పురుగు... అదే కాయతొలిచే పురుగు. ఎన్ని మందులు కొట్టినా.. దీన్ని సమూలంగా నివారించడం మాత్రం సాధ్యం కాదు. ఈ కాయతొలిచే పురుగుకు శాశ్వత పరిష్కారమంటూ ముందుకొస్తోంది.. బీటీ పరిజ్ఞానం. వంకాయలోకి ఈ బ్యాక్టీరియాను ప్రవేశ పెడితే.. పురుగును సమూలంగా నాశనం చేస్తుందని బీటీ విత్తనాలు తయారు చేస్తున్న అమెరికన్ కంపెనీ మోన్‌శాంటో చెబుతోంది. పైగా.. బీటీ వంగను సాగుచేస్తే.. ఎలాంటి క్రిమిసంహారకాలను వాడనక్కరలేదంటోంది. కానీ, ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. తరతరాలుగా విత్తనాలను మన రైతులే తయారు చేసుకుంటున్నారు. మంచి వంగడాలు కావాలంటే.. ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. వీటిని సాగు చేయడం ద్వారా కాసిన కాయలనుంచి.. మళ్లీ విత్తనాలను తయారు చేసుకునే సౌలభ్యం ఉంది. కానీ.. బీటీ విషయంలో మాత్రం ఇలా కాదు. బీటీవిత్తనాలను ప్రతీసారి కంపెనీనుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైగా... సాధారణ వంగడాలతో పోల్చితే.. బీటీ విత్తనాల ధర చాలా ఎక్కువ. దేశంలోని రైతులందరినీ.. దోచుకోవడానికి ఈ ప్లాన్ అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా.. ఓ బహుళజాతి సంస్థకు మేలు చేకూర్చడానికి ఇంత ఆత్రం చూపిస్తున్న ప్రభుత్వం.. రైతు సమస్యలను పట్టించుకోవడంలేదని వాదిస్తున్నాయి.
బీటీ వంకాయతో మరో సమస్య కూడా ఉంది. ఇది కాయతొలుచు పురుగును మాత్రమే అరికడుతుంది. ఇతర పురుగులేమైనా పంటను సోకితే మళ్లీ పెస్టిసైడ్స్ కొట్టాల్సిందే. ఈ విషయంలో.. బీటీ వంకాయ విత్తనాలను మనదేశంలో సరఫరా చేయాలనుకుంటున్న మహికో కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. అంతేకాదు.. వంకాయలను తింటే.. మనుషులు అనారోగ్యం బారిన పడతారన్న అనుమానాలు ఉన్నాయి. క్యాన్సర్, సంతానలేమి, కిడ్నీ సమస్యలకు సంబంధించి.. మహికో కంపెనీ ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.

బీటీ అంటే..

భూమి పైపొరల్లో ఉంటుంది బీటీ బ్యాక్టీరియా. దీని పూర్తిపేరు.. బాసిల్లస్ తురంజెన్‌సిస్. కాయతొలుచు పురుగులను సంహరించే గుణం ఈ బ్యాక్టీరియాకు ఉంది. ఈ లక్షణాన్నే.. విత్తనాల్లోకి చొప్పించే.. ఈ పురుగుల నుంచి పంటకు పూర్తి రక్షణ లభిస్తుందన్న ఆలోచనతోనే.. బీటీ పరిజ్ఞానం రూపుదిద్దుకొంది. బీటీ బ్యాక్టీరియా డీఎన్‌ఏ లోని జన్యువులను.. విత్తనంలోని డీఎన్‌ఏతో కలపడం ద్వారా.. కొత్త వంగడాన్ని శాస్త్రీయ పద్దతుల్లో తయారు చేస్తారు.
బీటీ విత్తనాల నుంచి మొలకెత్తిన మొక్కలో.. బీటీ బ్యాక్టీరియా లక్షణాలుంటాయి. కాయతొలుచు పురుగు మొక్కపై దాడి చేసి.. కాయలను గానీ, ఆకులను గానీ తింటే.. అది కొద్దిసేపటికే చనిపోతుంది. దీనివల్ల పంటకు చీడపీడల సమస్య ఉండదన్నది.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసినవారు చెబుతున్నారు. క్షారపూరితంగా ఉండే చోట్లే.. ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది కాబట్టి.. పురుగులు చనిపోతాయి. ఇక మనుషుల విషయానికొస్తే.. మన కడుపులో మాత్రమే ఆమ్లాలుంటాయి.. మిగిలిన శరీరమంతా క్షారమయమే. కాబట్టి.. మనుషులకూ సమస్య ఉండొచ్చని కొంతమంది సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కడపులోకి వెళ్లగానే.. ఆమ్లాల వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోతుందని.. దీనివల్ల మిగిలిన శరీరాని ఎలాంటి సమస్యలు రావని మోనోశాంటో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిజ్ఞానానికి అనుకూలంగా ఉన్న వారి వాదనా.. కాస్త వింతగానే ఉంది.
అయితే.. బీటీ పరిజ్ఞానం వల్ల దిగుబడులు పెరుగుతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఇది కేవలం పురుగును నాశనం చేయడమే తప్ప.. దిగుబడిని పెంచే క్రాస్ ఫాలింగ్ వెరైటీ కానే కాదు. దేశంలో హరితవిప్లవం సమయంలో సృష్టించిన వరి, గోధుమ వంగడాల తరహాది కూడా కాదు. కాయతొలుచు పురుగును అరికట్టడం వల్ల ఆ కాయల వరకూ రైతులకు మిగిలే అవకాశం ఉండొచ్చు. పైగా.. ఇదంతా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రతీ విత్తనాన్ని ఈ తరహాలో సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరుపడితే వారు తయారుచేయడానికి కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా బీటీ పరిజ్ఞానం విషయంలో అమెరికన్ కంపెనీ మోనోశాంటో గుత్తాధిపత్యం సాగుతోంది. అందుకే.. విత్తనాల ధర చాలా ఎక్కువ. ఇప్పటికే.. బీటీ పత్తి విత్తనాలను మనదేశంలో అమ్ముతూ కోట్లు గడిస్తోంది. ఒక్క 2009లోనే.. 53 వేల కోట్ల రూపాయల వితనాలను ప్రపంచవ్యాప్తంగా అమ్మగలిగింది. దీన్ని బట్టి ఇదెంత పెద్ద వ్యాపారమో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఎక్కువగా వినియోగించే కూరల్లో వంగ ముందంజలో ఉండడంతో.. ఆ కంపెనీ కన్ను దీనిపై పడింది. పైగా.. కాయతొలుచు పురుగు ఇందులో ఉంటుంది కాబట్టి... దాన్ని నివారించడానికి బీటీ ఒక్కటే మందంటూ ప్రచారం చేస్తోంది.

బీటీ పత్తి సమస్య

బీటీ పరిజ్ఞానం మనకి కొత్తేమీ కాదు. కొన్నేళ్ల క్రితమే బీటీ పత్తి రంగ ప్రవేశం చేసింది. అయితే.. బీటీ పత్తితో లాభపడిన వారు కొంతమందే కాగా.. నష్టపోయినవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 2002-04 మధ్య తీవ్ర దుష్పరిణామాలను బీటీపత్తి సాగు చేసిన రైతులు ఎదుర్కోవాల్సి వచ్చింది.. బీటీ విత్తనాల్లో మొదటగా పత్తిని భారతదేశంలోకి ప్రవేశపెట్టింది మోనోశాంటో. దేశీయ సంస్థ మహికోతో కలిసి.. బీటీ పత్తిని మార్కెట్ చేసింది. జన్యుమార్పిడి పద్దతిలో పత్తి తొలిసారిగా ఇలా రైతులకు చేరింది. కాయతొలుచు పురుగుతో సతమతమవుతున్న రైతన్నలకు ఆపన్నహస్తంగా దీన్ని ప్రచారం చేశారు. పురుగు మందులు కొట్టాల్సిన పనే ఉండదంటూ ఊదరగొట్టారు. అప్పటికే.. పత్తిసాగులో తీవ్ర నష్టాలు చవి చూసిన వారంతా.. .. బీటీ విత్తనాలను అధికమొత్తం చెల్లించి కొనుగోలు చేశారు. కానీ, ఫలితం తారుమారయ్యింది. చాలా చోట్ల మొక్కలే సరిగ్గా రాలేదు. మొక్క పెరిగిన చోట కాయలు లేవు. కాయలున్న చోట.. పురుగులకు ఆహారమైపోయాయి. మళ్లీ పురుగుమందుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంమీద చూస్తే.. కంపెనీ చెప్పిన దానికి.. రైతులకు అందిన దానికి పోలికే లేదు.
బీటీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో చాలామంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బీటీ పత్తి మొక్కలను తిన్న ఆవులు, గేదెలు చనిపోయాయన్న వార్తలు రైతులను మరింత ఆందోళనలో పడేశాయి. అందుకే.. ఇప్పుడు బీటీ వంగ అనగానే.. రైతులకు మరోసారి బెంగపట్టుకుంది. పత్తి వాణిజ్య పంట మాత్రమే. కానీ, వంగ ఆహారపంట. ప్రతీ ఒక్కరూ తినే రకం. అందుకే.. దుష్పరిణామాలు ఎంతగా ఉండొచ్చో అన్న ఆందోళనలో జనం ఉన్నారు.

14 ఏళ్ల వయస్సు

జన్యుమార్పిడి పంటలు ప్రపంచానికి పరిచయం అయ్యి 14 ఏళ్లు దాటుతోంది. అయినా.. ఇప్పటివరకూ కేవలం 25 దేశాలు మాత్రమే ఈ వంగడాలకు అనుమతి ఇచ్చాయి. యురోపియన్ యూనియన్.. ఈ తరహా వంగడాలను పూర్తిగా నిషేధించింది. పెరూలో బీటీ బంగాళాదుంపలను నిషేధించారు. చైనాలో బీటీ సోయాకు అనుమతి లేదు. ప్రపంచం మొత్తంమీద సాగవుతున్న భూమిలో కేవలం 8 శాతం మాత్రమే జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయంటే.. వీటికి ఆదరణ ఎంత కరువయ్యిందో అర్థం చేసుకోవచ్చు. పైగా మన దగ్గర బీటీ పత్తి సృష్టించిన అనర్థాలను ఎవరూ మరిచిపోలేదు. దేశంలో వంగను పండించే ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్నాటక, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బీటీ వంగను నిషేధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి.
కానీ.. మన దగ్గర సమస్యలను సాకుగా చేసుకుని, బీటీ వంగడాలను ఎక్కువగా అమ్ముకునే కుట్ర ప్రస్తుతం జరుగుతోంది. బీటీ వంకాయకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే.. దాని వెంటే.. మరో 41 వంగడాలు బీటీ పరిజ్ఞానంతో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వరి, బంగాళాదుంపలు, టమాట, మొక్కజొన్న, కంది, వేరుశెనగ, ఆవాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బెండ ఇలా ఎన్నో రకాలు అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద ఎదురుచూస్తున్నాయి. మనం నిత్యం ఉపయోగించే మిరప, అల్లం, ఉల్లి, గోధుమ, అరటి లాంటి రకాల్లో బీటీ చొప్పించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. వంగతో సహా.. వీటన్నింటికీ అనుమతులు ఇస్తే.. మన వ్యవసాయం కొన్నేళ్లలో విదేశీ కంపెనీల నియంత్రణలోకి వెళ్లిపోవడం ఖాయమే. పైగా.. బీటీ పత్తి నుంచి పూర్తిస్థాయిలో పాఠాలు నేర్చుకోకుండానే.. మరో తప్పటడుగు వేస్తే మాత్రం భారీ మూల్యాన్నే ప్రభుత్వం చెల్లించుకోవాల్సి రావచ్చు.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందన్నది.. కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తాజా స్టేట్‌మెంట్. ఏదేమైనా.. బీటీ వంగతో.. మనుషులకు హాని జరుగుతుందా లేదా అన్నది మరింత శాస్త్రీయంగా పరిశోధించాల్సిన అవసరం మాత్రం ఉంది. పైగా.. ఇది ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిష్పక్షపాక్షికంగా జరిగినప్పుడే జనానికి నమ్మకం కలుగుతుంది.


Read more...

శనివారం 6 ఫిబ్రవరి 2010

హైస్కూల్‌లో హై రొమాన్స్


టాలీవుడ్‌ను మరో టీనేజ్ లవ్ స్టోరీ పలకరించనుంది. హైస్కూల్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు నరసింహ నంది దర్శకత్వం వహించారు. టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థే ఈ సినిమాలో హీరో. కార్తీక్ ఈ పాత్రలో నటించాడు. హీరో ఇంటికి ఎదురుగా ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కిరణ్‌రాథోడ్ నటించింది. ఇక స్టోరీ వివరాల్లోకి వెళితే..

అపార్ట్‌మెంట్‌లో కిరణ్‌రాథోడ్‌ ఒంటరిగా ఉంటుంది. ఆమె అందానికి ఫ్లాటైపోయి.. లవ్‌లో పడతాడు ఈ టెన్త్‌క్లాస్ అబ్బాయి. ఇద్దరిమధ్యా వయస్సులో చాలా తేడా ఉన్నప్పటికీ.. అదేమీ పట్టించుకోడు. ఆమెను రహస్యంగా అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతాడు.. నిత్యం ఆమె ధ్యాసలోనే గడుపుతుంటాడు. ఓ పూర్తిస్థాయి లవ్‌స్టోరీ తరహాలో ఈ సినిమాను దర్శకుడు నరసింహ తీశారు.అయితే.. కథ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం.. అనుకోని పరిస్థితులు హీరోకు ఎదురవుతాయి. యుక్తవయస్సులోకి వస్తున్న సమయంలోనే అమ్మయిల పట్ల ఆకర్షణకు లోనైతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశామంటున్నారు దర్శకుడు.

టాలీవుడ్‌కు అవసరమా..

1940లో ఒక కుగ్రామం లాంటి జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రాన్ని తీసిన దర్శకుడి నుంచి.. మరో ఉత్తమ చిత్రాన్ని ఆశించడం సహజమే. అయితే.. ఈ సినిమా విషయంలో మాత్రం.. కాస్త అంచనాలు తలకిందులు కావచ్చు.
హైస్కూల్.. చాలా చక్కని పేరు. కానీ.. సినిమాలో మాత్రం అంత చక్కదనం ఉన్నట్లు కనిపించడం లేదు. పదోక్లాస్ అబ్బాయికి.. 30 ఏళ్ల అమ్మాయికి మధ్య రొమాన్స్ పెడితే ఎలా ఉంటుందో.. అలానే ఉంది. కుర్రాడి ప్రేమను ఘాటుగా చూపించడానికి.. హాట్‌హాట్‌ సన్నివేశాలనే ఇందులో తీశారు. ముద్దుముచ్చట్లకూ సినిమాలో కొదవ లేదు. స్టోరీ లైన్‌ను సీన్లు చాలాచోట్ల క్రాస్ చేసేశాయి. ఇక పాటల విషయానికొస్తే.. సాహిత్యంలో శృంగార రసాన్ని ఓ పాలు ఎక్కువే పోశారు.
అందుకే కాబోలు... ఈ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కాస్త వెనుకడుగు వేసింది. సినిమాలోని దాదాపు సగం సీన్లకు కట్స్ చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ సెన్సార్ బోర్డు నిర్ణయంతో అసంతృప్తి చెందిన దర్శక నిర్మాతలు.. ఢిల్లీలోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హైస్కూల్‌లోని కొన్ని సీన్లను కట్‌చేసి.. A సర్టిఫికెట్‌ను ట్రిబ్యునల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో.. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అసలు.. క్లీన్ యు సర్టిఫికెట్ లభిస్తున్న సినిమాల్లోనే ఎన్నో అసభ్యకర సన్నివేశాలు.. డైలాగ్‌లు ఉంటుంటే.. సగం సినిమా కట్స్‌ను తృటిలో తప్పించుకున్న హైస్కూల్‌ ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులే ఊహించుకోవాలి.


Read more...

గురువారం 4 ఫిబ్రవరి 2010

కూలుతున్న కాపురాలు


జన్మజన్మల బంధంగా భావించే.. వివాహం.. విడాకులు అనే ఒకే ఒక్కపదంతో పుటుక్కున తెగిపోతోంది. చిన్న చిన్నఅనుమానాలు, అపార్థాలు.. వెరసి.. కాపురాలను కూలదోస్తున్నాయి. గత నాలుగైదు ఏళ్లుగా.. ఇలా విడాకులు కావాలంటున్న వారి సంఖ్య.. కుప్పలుతెప్పలుగా పెరిగిపోతోంది. అందులోనూ.. లైంగిక కారణాలు చూపించే కేసులు ఎక్కువవుతున్నాయి..

పెళ్లంటే నూరేళ్ల బంధం.. పెళ్లంటే జీవితాన్ని స్త్రీపురుషులిద్దరూ సమానంగా పంచుకోవడం. అందుకే.. పెళ్లి సమయంలో భార్యాభర్తలిద్దరి చేత ప్రమాణాలు చేయిస్తారు. ధర్మేచ, అర్దేఛ, కామేచ, మేక్షేచ, నాతిచరామి అనిపించి కన్యాదానం చేస్తారు. ఒకసారి పెళ్లైతే.. జీవితాతం కలిసుండడమే ఒకప్పుడు మనవాళ్లకు తెలుసు. చిన్నాపెద్దా సమస్యలొచ్చినా.. గొడవలు పెద్దవై విడిపోయినా.. అది తాత్కాలికంగానే ఉండేది. అయితే.. ఫాస్ట్ కల్చర్‌లో మార్పులూ ఫాస్ట్‌ఫాస్ట్‌గానే వచ్చేస్తున్నాయి. చిన్న గొడవ వచ్చినా విడిపోవడం కామన్ అయిపోయింది. అదీ చట్టబద్ధంగానే. అందుకే... విడాకులు కోరుకుంటున్నవారి సంఖ్య ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇందుకు చూపిస్తున్న సాకులు కూడా వింటే ఆశ్చర్యపడాల్సిందే. విడాకులు తీసుకోవడానికి చూపించగలిగే కారణాల్లో లైంగిక సామర్థ్యం కూడా ఒకటి. భర్త గానీ, భార్యగానీ తన జీవిత భాగస్వామని లైంగికంగా సంతృప్తి పరచలేకపోతే, విడాకులు కోరుకోవచ్చు. సరిగ్గా ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొనే ఎన్నో కేసులు కోర్టు మెట్లెక్కుతున్నాయి. అయితే.. అసలు కారణం మాత్రం వేరే ఉంటోంది.
విడాకుల కేసులను పరిశీలిస్తే.. పెళ్లిళ్లు ఎలా ఛిద్రమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మన రాష్ట్రంలో విడాకులు కోసం దాఖలవుతున్న పిటిషన్లలో అత్యధికభాగం.. సెక్సువల్ ఇంపోటెన్సీనే సాకుగా చూపిస్తున్నాయి. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా.. ఇలా విడాకులు కోరుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే.. తప్పుడు ఆరోపణలు చేసి.. లైంగిక సామర్థ్యం ఉన్నా లేదని విడాకులు కోరితే.. అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. దాన్ని నేరంగా పరిగణించాల్సి వస్తుంది. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో.. చాలామంది ఆ సాకుతోనే విడాకులు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక భార్యల దగ్గర నుంచి విడాకులు కోరుకుంటున్న భర్తలు కూడా.. దాదాపుగా ఇలాంటి సాకునే చూపిస్తున్నారు. అయితే.. వ్యభిచారం చేస్తున్నారనే కారణాన్ని చూపిస్తున్నారు. అందుకు అనవసరమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. భార్యాభర్తలు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చేస్తే.. పరస్పర అవగాహనతో విడిపోవడమే మేలు.. కానీ.. ఇలా అనవసర కారణాలు చెప్పడం ద్వారా సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు. అంతేకాదు.. .. అసలు కారణాన్ని చెప్పకుండా.. లైంగిక కారణాలను చూపించి.. చట్టాన్ని దుర్వినియోగం చేయడం ప్రమాదకరమే.

ఆధిపత్యమే అసలు కారణం

మన సమాజంలో చాలాకాలం పాటు పురుషాధిక్యమే. కానీ, ఇప్పుడు మహిళలు ముందంజలోకి వచ్చేశారు. అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. వంటిల్లుకే పరిమితం కావడం లేదు. ఆర్థికంగా స్వావలంభన సాధించారు. అందుకే.. పురుషుల డామినేషన్‌ను ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ, మగవాళ్లలో ఎక్కువమంది మాత్రం, ఆ పాత వాసనలను ఇంకా వదిలించుకోవడం లేదు. దాని ఫలితమే నిత్యం గొడవలు. టీవీ రిమోట్ దగ్గర నుంచి మొదలై.. కలిసి కాపురం చేయలేని పరిస్థితి సృష్టించేదాకా సాగుతాయి.
ఒకప్పుడు మనవన్నీ ఉమ్మడి కుటుంబాలు. భార్యాభర్తల మధ్య ఏ వివాదం వచ్చినా.. దాన్ని సామరస్యంగా పరిష్కరించగలిగే పెద్దలు ఇంట్లో ఉండేవారు. కానీ ఇప్పటి కాలం చిన్న కుటుంబాలది. ఉద్యోగాల కోసమో, వ్యాపారాల కోసం సొంతప్రాంతాలను వదిలి నగరాలను చేరుతున్నారు. వీరిలో భార్యాభర్తలు మాత్రమే ఉండే సంసారాలు ఎన్నో. వీరి విషయాలు పట్టించుకోవడానికి, వీరి మధ్య తగువులు తీర్చడానికి ఇళ్లల్లో పెద్దలెవరూ ఉండరు. ఒకవేళ ఉన్నా, వారిని లెక్క చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. పైగా ఇద్దరూ సంపాదించేవారే అయితే.. ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. క్రమంగా అది విడాకులకు దారి తీస్తోంది
ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య.. 1997 తో పోల్చితే.. 2007 నాటికి 50 శాతానికి పైగా పెరిగింది. ఆర్థికంగా మహిళలు భర్తపై ఆధారపడడం చాలా వరకూ తగ్గిపోయింది. కొన్ని కుటుంబాల్లో అయితే.. మహిళల సంపాదనే ఎక్కువగా ఉంటోంది. ఈ నేపధ్యంలో భర్త, అతని కుటుంబ సభ్యులతో సమస్యలు ఏవైనా వస్తే.. వేరు పడడానికే సిద్ధమవుతున్నారు.
ఇక మరో సమస్య ఇంటర్నెట్ ప్రేమలు. గంటలు గంటలు నెట్ లో చాటింగ్ చేయడం .. ఒకరినొకరు ఇంప్రెస్ చేయడానికి అందమైన అబద్దాలు అల్లుకోవడం .. ఈ పరిచయానికి తుది మజిలీ.. పెళ్లే అని మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. తీరా కొంత కాలం పోయాకా నిజాలు ఒక్కటొక్కటిగా అసలు నిజాలు   బయటకు వస్తుంటాయి.. మోసం చేశారన్న భావనతో విడాకులను ఆశ్రయిస్తున్న జంటల సంఖ్య ఈ మధ్య పెరుగుతోంది.

పెరుగుతున్న విడాకులు

జీవితాతం కలిసిమెలిసి సాగుదామన్న నమ్మకపు పునాదిపై కట్టిన తాళి... అపనమ్మకపు బీటలమధ్య తెగిపోతోంది.
ప్రపంచంలో విడాకుల రేటు ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. అక్కడ 45 నుంచి 50 శాతం పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఇక మన దేశానికి వస్తే.. 1990 వరకూ ఒక్క శాతం కన్నా తక్కువగానే విడాకులు తీసుకునేవారి సంఖ్య ఉండేది. అయితే.. 2001 జనాభా లెక్కలను విశ్లేషిస్తే.. మన దేశంలో విడాకుల రేటు 7 శాతాన్ని దాటి పోయిందని తేలింది. ఒక దశాబ్దకాలంలో విడాకుల్లో ఇంత వృద్ధి కనపించడం ఓరకంగా షాకే. అయితే.. ప్రస్తుతం ఈ రేటు పది శాతాన్ని దాటేయవచ్చని అంచనా. ఒక్కమాటలో చెప్పాలంటే.. కష్టమైనా, నష్టమైనా కలిసి ఉండాలనే సూత్రానికి భార్యాభర్తలిద్దరూ చెల్లు చెప్పేస్తున్నారు. విడాకులు తీసుకోవడమూ పెద్ద అవమానంగా ఈ కాలంలో భావించడం లేదు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే కొద్దీ, ఈ విడాకుల రేటు పెరిగిపోతోంది. అయితే, ఇందులో మహిళలను మాత్రమే తప్పుపట్టాలని లేదు. ఇందులో మగవాళ్ల పాత్ర కూడా ఎంతో ఉంది. మారుతున్న సమాజానికి తగ్గట్లుగా మగాడు మారడం లేదు. కనీసం.. మహిళల శ్రమను గుర్తించే పరిస్థితుల్లో కూడా లేడు. అందుకే.. ఈ విడాకులు.
ఇక.. విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్న మహిళలందరికీ విడాకులు వచ్చేస్తున్నాయా అంటే అదీ లేదు. మహిళలను ఇబ్బంది పెట్టడానికి పురుషుల దగ్గర ఎన్నో అస్త్రాలుంటాయి. లాయర్లు కూడా వాటికి వంతపాడుతుండడంతో.. అందరికీ న్యాయం జరగడం లేదు. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టినవారికి సులువుగానే విడాకులు వస్తున్నా... నిజంగా బాధపడుతున్న మహిళలకు మాత్రం ఈ విషయంలో చుక్కెదురే అవుతోంది. ఇలా బాధపడుతున్న వారిలో న్యాయవాదులు కూడా ఉండడం.. గమనార్హం. విడాకులు తీసేసుకోవాలనగానే లభించవు.. అందుకు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కాబోలు.. సులువుగా విడాకులు దొరికే మార్గాలను అంతా అన్వేషిస్తున్నారు.

ఎక్స్‌పార్టీ డైవోర్స్

ఎక్స్‌పార్టీ డిక్రీ.. వ్యాపార లావాదేవీల్లోనో, ఇతర లీగల్ వ్యవహారాల్లోనే కోర్టులు ఎక్కువగా ఈ తరహా తీర్పులను ఇస్తుంటాయి. కేసులో ఒకపార్టీ విచారణకు హాజరుకాకపోయినా, కోర్టు పంపించిన నోటీసులకు స్పందించకపోయినా.. మరో పార్టీకి అనుకూలంగా తీర్పు నిచ్చేస్తారు. అయితే.. ఈ సంస్కృతి ఇప్పుడు విడాకుల కేసులకూ అంటుకొంది. భార్యతో ఒకే ఇంటిలో ఉంటూ కాపురం చేస్తూనే.. ఆమెకు తెలియకుండా విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భార్యాభర్తల్లో ఒకరికి తెలియకుండా మరొకరు విడాకులు తీసుకోవడమే.. ఈ ఎక్స్‌పార్టీ. అడ్రస్‌లు తప్పుపెట్టి, మేనేజ్ చేయడం ద్వారానో లేదంటే.. భార్య లేని సమయంలో నోటీసులు వచ్చేలా అరేంజ్ చేసుకోవడమో చేస్తుంటారు. ఎక్స్ పార్టీ డిక్రీ ద్వారా విడాకులు పొందుతారు. ఇలా విడాకులు అందుకున్న వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఇలాంటి కేసులను పరిష్కరించడానికి కోర్టులు బాధితులకు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తున్నాయి. కౌంటర్ దాఖలు చేసి.. విడాకులను రద్దు కూడా చేసుకోవచ్చు. అయితే.. ఈ విషయం తెలిసి.. కోర్టులను ఆశ్రయించే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే.. పరస్పర అంగీకారంతో తీసుకోవాల్సిన విడాకులను ఇలా ఎక్స్‌పార్టీగా ఇవ్వకుండా కోర్టులు వ్యవహారించాల్సిన అవసరం ఉంది.

భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు.. ఇద్దరూ సమానమే. డైవోర్స్ తీసుకునే ముందు.. ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకున్నా.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా.. సమస్యను సులువుగానే దాటేయొచ్చు. కలకాలం కలిసి కాపురం చేయొచ్చు. డైవోర్స్ తీసుకుంటున్న జంటలు బాగానే ఉంటున్నా.. వారి పిల్లలు మాత్రం తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే.. వారి కోసమైనా ఒక్కసారి విడాకులు తీసుకునేముందు ఆలోచించండి. మీ కాపురాలు కూలిపోకుండా జాగ్రత్త పడండి..


Read more...

శ్రీకృష్ణరాయబారం

అందరూ ఊహించినట్లుగానే.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వ శ్రీకృష్ణ రాయబారాన్ని పంపుతోంది. జస్టిస్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాలతో విస్తృతమైన సంప్రదింపులను ఈ కమిటీ జరుపుతుందని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామంటూ..
డిసెంబర్ 9న హోమంత్రి చిదంబరం చేసిన ప్రకటన, సంప్రదింపులంటూ డిసెంబర్ 23న చేసిన ప్రకటన, జనవరి 5న రాజకీయ పార్టీలతో సమావేశం... ఆధారంగానే ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ సభ్యులుగా.. నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రణబీర్ సింగ్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసెర్చ్‌ ఫెలోడాక్టర్‌ అబుసలే షరీఫ్‌, ఢిల్లీ ఐఐటీలో హ్యుమానిటీస్‌ సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్ను నియమించింది. వీరిలో దుగ్గల్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు..
కమిటీ నియామకంపై.. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమైక్యాంధ్రగా ఉండడానికి కమిటీ అవసరం లేదు కాబట్టి.. తెలంగాణ ఏర్పాటు కోసమే అన్నది కొంతమంది అభిప్రాయం. దీంతో పాటు.. రాష్ట్ర విభజన విషయంలో కోస్తాంధ్ర నేతల అనుమానాలు తీరుపోవచ్చని కూడా ఆశిస్తున్నారు. అయితే.. కమిటీ విషయంలో కాలపరిమితి విధించకపోవడం, తెలంగాణ ఊసు ప్రస్తావించకపోవడం.. నియమ నిబంధనలను రూపొందించకపోవడంతో తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఈ కమిటీపై పెదవి విరుస్తున్నారు. కమిటీలతో ఒరిగేదేమీ ఉండదంటున్నారు.
ఇక అటు ఆంధ్రప్రాంతంలోనూ దాదాపు ఇదే పరిస్థితి. కమిటీ విషయంలో కొంతమంది సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే విధివిధానాలను ఖరారు చేయకపోవడాన్ని తప్పు బడుతున్నారు. దేశవ్యాప్తంగా చిన్నరాష్ట్రాలకు సంబంధించి ఎన్నో డిమాండ్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కమిటీ ఏర్పాటు చేయడం సరికాదంటున్నారు. మొత్తంమీద.. కమిటీ ఏర్పాటుతోనే ఇంత గందరగోళం ఏర్పడితే.. ఇక విధివిధానాలు రూపొందించిన తర్వాత.. మరిన్ని సమస్యలు వచ్చేలానే కనిపిస్తున్నాయి.


కమిటీ తేల్చేదేమిటి?


తెలంగాణ ఏర్పాటులో భాగంగా కమిటీని ఏర్పాటు చేస్తున్నారా.. లేక .. ఆంధ్రప్రదేశ్‌ను యదాతథంగా ఉంచడానికా అన్న విషయాన్ని ప్రకటనలో ప్రభుత్వం పేర్కొనలేదు. చాలా చాకచక్యంగా ఈ ప్రకటనను రూపొందించారు. ఏ ప్రాంతానికి మద్దతుగా ఈ ప్రకటన లేకుండా జాగ్రత్తపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సంప్రదింపులకోసం కమిటీని ఏర్పాటు చేశామని ప్రకటించారు. అయితే.. ఇవి ఏ పరిస్థితులన్నది కూడా ప్రకటన పూర్తి పాఠంలో లేదు. రాష్ట్ర విభజన విషయంలో హోంమంత్రి చేసిన ప్రకటనలతో పాటు.. రాజకీయ పార్టీలతో సమావేశానికి అనుగుణంగానే కమిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ అందులో వివరణ ఇచ్చారు. ఇప్పుడు అందరి సందేహం.. కమిటీ తెలంగాణకు అనుకూలమా.. వ్యతిరేకమా అన్నదే. అయితే... ఈ విషయంలో సింపుల్‌గా ఓ అభిప్రాయానికి వచ్చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. కమిటీలో ఉన్నవారంతా ఉన్నతస్థాయిలో ఉన్నవారే. పైగా.. రాజకీయంగా కానీ, భౌగోళికంగా మనరాష్ట్రంలో ఏమాత్రం సంబంధం లేనివారు. తెలంగాణపై ఇప్పటికీ వీరందరికీ ఓ అభిప్రాయమంటూ ఉండకపోవచ్చు. ప్రజలు, పార్టీలు, సంస్థలతో విస్తృతమైన సంప్రదింపులను కమిటీ చేస్తుందని ప్రకటించారు కాబట్టి.. ఆ సంప్రదింపుల ఆధారంగానే వీరంతా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఏ ఏ అంశాలను వీరు పరిశీలిస్తారన్నది ఇంకా తేలాల్సి ఉంది.
కమిటీలో మాత్రం ప్రభుత్వం కీలకమైన వ్యక్తులకే ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పాలి. కీలకమైన కమిటీలకు నేతృత్వం వహించిన ఘనత జస్టిస్ శ్రీకృష్ణది. ఇక నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా పనిచేస్తున్నరణబీర్ సింగ్‌కూ ఈ కమిటీలో స్థానం కల్పించారు. న్యాయపరమైన సమస్యలపై ఈయన దృష్టి పెట్టే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్ కె.దుగ్గల్ ను నియమించడం ద్వారా.. శాంతిభద్రతల అంశంపైనా.. ఈ కమిటీ పరీశీలిస్తుందని ప్రభుత్వం సూచన ఇచ్చింది. ఇక మిగిలిన ఇద్దరు సభ్యులు అబుసలే షరీఫ్, డాక్టర్ రవీందర్ కౌర్‌లు రాష్ట్ర విభజనకు ఏర్పడే ఇబ్బందులను విశ్లేషించవచ్చు. అయితే.. అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే వీటిపై తుదినిర్ణయం తీసుకోవచ్చు.
మొత్తంమీద అన్ని విషయాలపైనా.. ఈ కమిటీ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే.. కమిటీ ఛైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణతో చర్చించిన తర్వాతే విధివిధానాలను రూపొందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి.. కమిటీ ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నది తేలాల్సి ఉంది.

జస్టిస్ శ్రీకృష్ణ బ్యాక్ గ్రౌండ్

రాష్ట్రంలోని పరిస్థితులపై సంప్రదింపులు జరపడానికి ఏర్పాటు చేసిన కమిటీ సారధ్య బాధ్యతలను జస్టిస్ శ్రీకృష్ణకు అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కీలకమైన కమిటీలకు ఆయన నేతృత్వం వహించారు. సంచలనం సృష్టించిన బొంబాయి అల్లర్ల సంఘటనపై విచారణ జరిపింది కూడా జస్టిస్ శ్రీకృష్ణే. అప్పటికి.. బోంబే హైకోర్టులో ఆయన జూనియర్ జడ్జిగా ఉన్నారు. మతకలహాలకు సంబంధించిన ఈ కేసును విచారించే కమిటీకి నేతృత్వం వహించడానికి సీనియర్లు కూడా వెనుకడుగు వేసిన తరుణంలో జస్టిస్ శ్రీకృష్ణ ముందుకు వచ్చారు. దీనిపై.. సుదీర్ఘ విచారణను జరిపారు. దాదాపు ఐదేళ్ల పాటు బాధితులను విచారిస్తూనే ఉన్నారు. శివసేనపై తన రిపోర్ట్‌లో విమర్శలు కూడా చేసినట్లు సమాచారం. మధ్యలో ఓ సారి ఈ కమిటీని శివసేన ప్రభుత్వం రద్దు చేసినా.. ప్రతిపక్షాల ఆందోళనతో మళ్లీ పునరుద్దరించింది. తుది నివేదికను ఇచ్చినా ఇంతవరకూ మహారాష్ట్ర సర్కార్ దాన్ని ఆమోదించడం కానీ.. అమలు గానీ చేయలేదు.
మద్రాస్ హైకోర్టులో ఫిబ్రవరి 19, 2009న లాయర్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలపైనా జస్టిస్ శ్రీకృష్ణ ఏకసభ్య కమిషన్ విచారణ జరిపింది. సంఘటనకు సంబంధించిన కారణాలతో.. మార్చి 4, 2009న ఆయన సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికను సమర్పించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరో వేతన సంఘానికి ఛైర్మన్‌గా జస్టిస్ శ్రీకృష్ణ పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులపై సంప్రదింపులు జరిపే కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే.. టైం ఫ్రేమ్ పెట్టకపోవడంతో.. విపరీతమైన జాప్యం జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జస్టిస్ శ్రీకృష్ణపై మాత్రం.. పూర్తి వ్యతిరేకత ఎక్కడా వ్యక్తం కావడం లేదు. ఆయన వీలైనంత త్వరగానే ఈ విషయాన్ని తేల్చుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. సంప్రదింపుల వరకే ఈ కమిటీ పరిమితయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టాలా వద్దా అన్నది తేల్చకపోవచ్చు.

ఆనాడు మహాభారత సంగ్రామాన్ని నివారించడానికి వెళ్లిన శ్రీకృష్ణుడు.. యుద్ధం జరగడానికి ఓ రకంగా కారణమయ్యాడు. మరి ఈ శ్రీకృష్ణుడు రాష్ట్రాన్ని విడగొట్టమని చెబుతాడా.. లేక కలిసిఉంటే చాలని తేల్చేస్తాడా... ఏం జరుగుతుందో చూడాలి..


Read more...

బుధవారం 3 ఫిబ్రవరి 2010

తెలంగాణపై కేంద్ర కమిటీ


తెలంగాణపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మొత్తంమీద కమిటీని ఏర్పాటుచేసింది. ఏ వర్గానికీ ఇబ్బందిలేకుండా.. విధివధానాలను ఖరారు చేయకుండానే ఐదుగురు సభ్యులతో కమిటీని ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్.శ్రీకృష్ణ దీనికి నేతృత్వం వహిస్తారు. ఈయనతోపాటు జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ రీసెర్చ్‌ ఫెలోడాక్టర్‌ అబుసలే షరీఫ్‌, ఢిల్లీ ఐఐటీలో హ్యుమానిటీస్‌- సోషల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవీందర్‌ కౌర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి వినోద్‌ కె.దుగ్గల్‌ కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తారు.. డిసెంబర్‌ 9, 23వ తేదీల్లో కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటనలు, జనవరి 5న ఎనిమిది రాజకీయ పార్టీలతో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు ప్రజలతో విస్తృతమైన చర్చలు జరుపుతుందని మాత్రమే వెల్లడించింది. ఈ ప్రకటనలో హోంశాఖ ఎక్కడా తెలంగాణ ఊసెత్తలేదు. కమిటీ ఛైర్మన్‌తో చర్చించిన తర్వాతే విధివిధానాలను ఖరారు చేస్తారని పేర్కొంది.


Read more...

మంగళవారం 2 ఫిబ్రవరి 2010

పాపం పసివాళ్లు..


స్కూలు వెళ్లివస్తానమ్మా అంటూ కారెక్కిన చిన్నారి వైష్ణవి.. కానరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆడుతూ పాడుతూ తిరగాల్సిన ఆ చిన్నారి.. కుటుంబ కక్షలకు బలైపోయింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హతమార్చారు ప్రభాకర్ బంధువులు. అందరి మధ్యా చలాకీగా తిరిగే నాగవైష్ణవి.. ఇప్పుడు ఇనుప కొలిమిలో బూడిదగా మిగిలింది. వైష్ణవి కిడ్నాప్ వార్త.. ఆమె కుటుంబంలో విషాదాన్నే నింపింది. సంఘటన జరిగినప్పటి నుంచీ..
ఆమె తల్లిదండ్రులు ప్రభాకర్, నర్మదల గుండెలు బరువెక్కాయి. అయినా.. ఎక్కడో చిన్న ఆశ. తమ చిన్నారి సురక్షితంగా తిరిగివస్తుందన్న నమ్మకం. కానీ.. ఆ ఆశలు అడియాశలయ్యాయి. వైష్ణవి ప్రాణం తీయడానికే కిడ్నాప్ చేయించిన ఆమె మామయ్య వెంకట్రావు.. అనుకున్న పని చేసేశారు. ఏమాత్రం జాలి లేకుండా.. కాస్తైనా కనికరం చూపకుండా.. ఆ పసిప్రాణాన్ని తీశారు. ఈ వార్త తెలియడంతోనే.. వైష్ణవిని ప్రాణంలా పెంచిన పలగాని ప్రభాకర్ గుండె షాక్‌కు గురయ్యింది. తన చిట్టితల్లి ఇక లేదన్న వార్త తట్టుకోలేని ఆ హృదయం.. ఆగి పోయింది.
కిడ్నాప్ చేసిన ముఠా ప్రాణాలు తీయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదని మొదటిరోజే తెలిసిపోయింది. కిడ్నాప్ చేసే క్రమంలో, కారు డ్రైవర్‌ను కూడా హత్య చేశారు. ప్రభాకర్ పిల్లలిద్దరినీ కిడ్నాప్ చేయాలన్నదే దుండగుల ప్లాన్ అయినప్పటికీ, వైష్ణవి అన్న సాయిశిరీష్ మాత్రం.. కారు దిగి పారిపోవడంతో తప్పించుకోగలిగాడు. లేదంటే.. ఆ చిన్నారి కూడా ఈ పాటికి విగతజీవిగానే కనిపించేవాడేమో.. ఇక కిడ్నాప్‌ను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైష్ణవిని తీసుకువెళ్లిన మరుక్షణమే స్పందించి ఉంటే.. ఎంతో కొంత ఉపయోగం ఉండేదన్న ఆభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైష్ణవిని ఇంతకు ముందుకూడా ఓ సారి కిడ్నాప్ చేశారు. అయితే.. సురక్షితంగానే వదిలిపెట్టారు. ఈ సమయంలో కిడ్నాపర్లు కోరినంత డబ్బు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా.. కిడ్నాపర్ల నుంచే సమాచారం వస్తుందంన్నట్లుగా ఎదురుచూశారు. రెండు రోజులైనా.. అటువైపు నుంచి ఇన్‌ఫర్మేషన్ రాకపోవడంతో.. బంధువులపై దృష్టి పెట్టారు.
వైష్ణవిని చంపించిన వెంకట్రావుకు, ఇంతకుముందు కిడ్నాప్‌లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును వేగంగా ఛేదించడంలో పోలీసులు విఫలం చెందారు. అయితే... ఇక్కడ కేవలం పోలీసులను మాత్రమే నిందించలేం. కిడ్నాప్ జరిగిన వెంటనే ప్రభాకర్ బంధువులపై అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. మొదటి భార్య గురించి, వెంకట్రావు గురించి.. గత కిడ్నాప్ విషయాలను చెప్పలేదు. రెండు రోజుల తర్వాత సుదీర్ఘంగా విచారిస్తే తప్ప.. పూర్తి సమాచారం చెప్పలేదు. ఆ తర్వాతే.. ఈ కేసులో చిక్కుముడి వీడిపోయింది. మొదటి రోజే బంధువులను విచారించి ఉంటే.. నాగవైష్ణవి ప్రాణాలతో దక్కే అవకాశం ఎక్కువగానే ఉండేది. మొత్తానికి వైష్ణవి కిడ్నాప్ విషాధంగా ముగిసింది. హంతకులను కఠినాతికఠినంగా శిక్షించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు.

కిడ్నాపుల రాష్ట్రం


చిన్నారుల కిడ్నాప్‌లో మన రాష్ట్రం దేశంలోనే ఐదోస్థానంలో ఉంది. 2007లో రాష్ట్రంలో 1499 మంది, 2008లో 1431 మంది, 2009 దాదాపు 15వందల మంది చిన్నారులు కిడ్నాప్ అయ్యారు. వీరిలోనూ పదేళ్లలోపున ఉన్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. డబ్బు కోసం ఆస్తిపరుల పిల్లలను కిడ్నాప్ చేయడం చాలాకాలంగా వస్తున్నదే. దీంతో పాటు.. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, వ్యాపార లావాదేవీల కారణంగానూ.. చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని ఇటీవలి కేసులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈ తరహా కేసుల్లో చాలావరకూ పిల్లల ప్రాణాలను కర్కశంగా తీసేస్తున్నారు. వైష్ణవి హత్యకేసు కూడా ఈ కోవలోదే. పాత కేసులను పరిశీలిస్తే.. 2009లో నల్గొండ జిల్లాకు చెందిన శ్వేత, శివ అనే చిన్నారులను పాతకక్షల నేపథ్యంలో కిడ్నాప్ చేసి హతమార్చారు. 2008లో తిరుపతిలో ఆయేషా అనే అమ్మాయిని సమీప బంధువులే కిడ్నాప్ చేసి చంపేశారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో మొయినుద్దీన్ అనే బాలుడిని ఆస్తికోసం బంధువులే చంపేశారు. రాజేంద్రనగర్‌లో రియల్ఎస్టేట్ విభేదాలు.. నవీన్ అనే పిల్లాడి హత్యకు దారితీశాయి. ఇలా చూసుకుంటూ వెళితే.. ఎన్నో కేసులు..
డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ అయితే.. ఒకటి రెండు రోజుల్లోనే.. ఏదో ఓ సమాచారం వస్తుంది. డబ్బు ఇవ్వాలన్న డిమాండ్ను కిడ్నాపర్లు చేస్తారు. డబ్బు ముట్టజెప్పితే, చాలావరకూ పిల్లలను వదిలివేస్తారు. లేదంటే.. ఫోన్‌కాల్స్ ఆధారంగా పోలీసులే చేధించి విడిపిస్తారు. కానీ.. కక్ష తీర్చుకోవడానికే కిడ్నాప్ జరిగితే మాత్రం.. ప్రాణాలతో వదులుతారన్న ఆశలేదు. కనీసం కిడ్నాప్ ఎందుకు చేశారన్న సమాచారమూ తెలియదు. ఇక్కడే చురుగ్గా వ్యవహరించాల్సిన పోలీసులు.. అన్ని కేసులనూ ఒకే గాటన కట్టేస్తున్నారు. సమాజంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా కిడ్నాప్ కేసులను చూడడంలో విఫలమవుతున్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే.. రాష్ట్రం మొత్తాన్ని విషాధంలో నింపిన వైష్ణవి కిడ్నాప్.
కిడ్నాప్ జరిగిన తర్వాత ప్రతీక్షణమూ ఎంతో విలువైనదే. పిల్లలను ప్రాణాలతో దక్కించుకోవడానికి ఉపయోగపడేదే. కిడ్నాప్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి కాబట్టి.. సాధారణ పోలీసులు దీన్ని టేకప్ చేస్తే.. వెంటనే చేధించడం కష్టం. పైగా.. ఒక్కో కేసులో ఒక్కో కోణం ఉంటుంది కాబట్టి.. దీనికి స్పైషలైజ్‌డ్ పోలీసులు కావాల్సి ఉంటుంది. అందుకే.. టాస్క్‌ఫోర్స్ తరహాలో ప్రత్యేక పోలీసు విభాగాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. వైష్ణవి హత్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మరింతగా చొరవచూపించాల్సి ఉంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి కిడ్నాప్‌లను అరికట్టాల్సి ఉంది.

ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడుపడితే అప్పుడు చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. పగటిపూటే... అందులోనూ నడిరోడ్డుపైనే తెగబడి.. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైష్ణవి విషయంలోనూ జరిగింది ఇదే. స్కూల్ వెళుతున్న కారును అడ్డగించి మరీ.. ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. కారు డ్రైవర్‌ను హత్యచేస్తున్నా.. చుట్టూ ఉన్నజనం చూస్తూనే ఉన్నారే తప్ప.. అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఓ రకంగా ఎవరూ పట్టనట్లే ఉన్నారు. నేరాలు విచ్చలవిడిగా జరగడానికి ఇదో కారణం. ఎవరూ ఏమీ అడగరు.. ఎవరూ అడ్డుకోరన్న ధీమాతోనే.. దుండగులు రెచ్చిపోతున్నారు.

కిడ్నాప్‌తో ఎన్నో అనర్థాలు..

ఎవరిపిల్లలను వారే కాపాడుకోవాలి. వారు జాగ్రత్తగాఉండేలా చూసుకోవాలి. కిడ్నాప్‌లకు గురవ్వకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను ఒంటరిగా వదలకూడదు. వారి వెంట పెద్దవాళ్లుగాను, ఇతర పిల్లలు గానీ ఉండేలా చూసుకోవాలి. స్కూల్‌కు పంపేటప్పుడు వీలైనంతవరకూ పేరెంట్స్ వెళ్లడమే శ్రేయస్కరం. లేదంటే.. స్కూల్ బస్సులో అయినా పంపించండి.. రిక్షాలు, ఆటోలు ఎక్కించడమూ శ్రేయస్కరం కాదు. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పాలి. ఎవరైనా బిస్కెట్లు, చాకెట్లు ఇస్తున్నా.. తీసుకోవద్దని చెప్పాలి. ముఖ్యంగా ఆడపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు రాష్ట్రంలో చాలా ఎక్కువగా సంచరిస్తున్నాయి. అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. వారిని వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోనూ తాజాగా.. ఇలానే ఆడపిల్లలను ఎత్తుకెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు.

కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లల భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. శత్రువుల సమాచారాన్ని పిల్లలకు చెప్పి.. వారితో జాగ్రత్తగా ఉండమనాలి. ఒకవేళ, పొరపాటున కిడ్నాప్ లాంటి సంఘటనలు జరిగితే.. వీలైనంత వేగంగా పోలీసులను సంప్రదించాలి. కేవలం.. డబ్బుకోసమే కిడ్నాప్ జరిగిందని భావించకూడదు. వ్యాపారపరంగా, కుటుంబ పరంగా కిడ్నాప్ జరగడానికి అవకాశాలున్నామో ఆలోచించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమానాలను పోలీసులకు చెప్పాలి. పోలీసులకూ విచారణలో పూర్తిగా సహకరిస్తే తప్ప.. కిడ్నాప్ కేసులు చేధించడం సాధ్యం కాదు. లేకపోతే.. బిడ్డ ప్రాణాలతో వస్తాడన్న గ్యారెంటీ కూడా ఉండదు.
ఓ చిన్ని తార రాలిపోయింది.. కిడ్నాపర్ల చెరలో విలవిలలాడి, విగతజీవిగా మారింది. వైష్ణవిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ పసిపిల్లే ప్రాణమనుకుంటున్న .. ఆమె తండ్రి ప్రభాకర్ గుండె ఆగిపోయింది. హఠాత్తుగా ఎదురయైన ఆ కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఒక కిడ్నాప్.. ఆ కుటుంబంలోని రెండు ప్రాణాలను బలితీసుకొంది. వైష్ణవి తల్లి, అన్నల పరిస్థితి ఇప్పుడేమిటి? వారికి తోడుండేది.. తోడ్పాటు అందిచేది ఎవరు?
ఇక ఈ పిల్లలను కిడ్నాపర్ల బారినుంచి కాపాడే ప్రయత్నంలో కారు డ్రైవర్ లక్ష్మణరావు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై ఆధారపడ్డ కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకునే దెవరు? వారి శోకాన్ని తీర్చేదెవరు....
వైష్ణవి కిడ్నాప్ వ్యవహారం ముగ్గురు ప్రాణాలను బలితీసుకొంది. కిడ్నాప్‌కు ప్లాన్ చేసినవారి సమస్యలు తీరిపోయిందా.. అంటే సమస్య మరింత పెరిగిందనే చెప్పాలి. కిడ్నాప్ చేయడం ఐపీసీ 363 ప్రకారం నేరం. రుజువైతే.. ఏడేళ్లదాకా శిక్ష పడుతుంది. హత్య కూడా చేస్తే.. ఐపీసీ 364, 302 కింద కేసు నమోదవుతుంది. రుజువైతే.. మరణశిక్ష పడుతుంది. వైష్ణవిని చంపడానికి ప్లాన్ చేసిన ప్రభాకర్ బంధువు.. వెంకట్రావు ఇప్పుడీ కేసులోనే ఇరుక్కున్నారు. ఆయనతో పాటు.. కిడ్నాప్ చేసినవారందరూ నేరస్థులే. వైష్ణవి హత్యకేసు చిక్కుముడి వీడిపోయింది కాబట్టి.. వీరందరికీ శిక్షపడడం ఖాయమే. అంటే.. వీరిపైనే ఆధారపడ్డ కుటుంబాలు కూడా వీధిన పడినట్లే..


Read more...

సోమవారం 1 ఫిబ్రవరి 2010

కాలి బూడిదైన చిన్నారి వైష్ణవి

విజయవాడ వైష్ణవి కేసు విషాదంగా ముగిసింది. ప్రాణాలతో బయటపడుతుందనుకున్న ఆ చిన్నారి.. కాలి బూడిదగా మిగిలింది. పోలీసుల వైఫల్యానికి నిదర్శనంగా వైష్ణవి విగతజీవిగా మారింది. పెద్దల వైఫల్యాలకు ఇలా చిన్నారులు బలికావాల్సిందేనా..
కిరాతకుల కర్కశత్వం మరోసారి బయటపడింది. ఆడుతూపాడుతూ గడపాల్సిన చిన్నారి వైష్ణవి కాలి బూడిదయ్యింది. మూడు రోజుల క్రితం స్కూల్‌కి వెళుతుండగా వైష్ణవిని కిడ్నాప్ చేసిన దుండగులు.. గుంటూరు వైపు తీసుకువెళ్లిపోయారు. ఎంతగా వెతికినా ఆచూకీ ఎంతమాత్రం తెలియలేదు. మూడు రోజులుగా ఈ కేసును సవాల్‌కు తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు.. వైష్ణవి చనిపోయిందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వార్త తెలియడంతో వైష్ణవి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గుండలలిసేలా విలపించారు.
బంధువులే హంతకులు?
వైష్ణవి తండ్రి ప్రభాకర్ మొదటిభార్య బంధువులే ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలోనూ.. ఆమె సమీప బంధువే.. వైష్ణవిని చంపేశామని అంగీకరించినట్లు సమాచారం. గుంటూరు సమీపంలోని ఆటోనగర్‌లో వైష్ణవి మృతదేహం లభించింది. ఆధారాలు దొరకకుండా చేసేందుకు.. ఇనుమును కాల్చే కొలిమిలో వైష్ణవిని కాల్చేశారు. ముట్టుకుంటే బూడిదయ్యే స్థితిలో వైష్ణవి డెడ్‌బాడీ ఉంది. కిరాయి హంతకులే ఈ పని చేసి ఉంటారని తెలుస్తోంది. పెద్దల మధ్య విభేదాలకు ఓ చిన్నారి బలి కావడం అందరినీ కలిచివేస్తోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని అత్యంత కిరాతకంగా ప్రాణం తీయాలనిపించిన హంతకులను ఏం చేయాలి ?


Read more...

శనివారం 30 జనవరి 2010

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్లు..

హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయవాడ, విశాఖ వెళ్లాలనుకుంటున్నారా.. లేదా.. అక్కడినుంచి హైదరాబాద్ రావాలనుకుంటున్నారా.. టికెట్ల కోసం ఆర్టీసీ బుకింగ్ దగ్గర క్యూలు, ప్రైవేట్ ఏజెంట్ల చుట్టూ తిరగడం ఇష్టం లేదా.. అయితే ఇది మీకోసమే. ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని.. 24 గంటలు, అక్బర్ ట్రావెల్స్ ఆన్‌లైన్.కామ్ ద్వారా మీకు అందుబాటులోకి తెచ్చింది. పైగా.. ఇది లోఫేర్ ఆఫర్ కూడా. www.24gantalu.co.cc సైట్ ఓపెన్ చేయగానే.. కుడివైపు కనపడే అక్బర్ ట్రావెల్స్ క్లిక్ చేసి మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కేవలం బస్ టికెట్లు మాత్రమే కాదు, విమాన టికెట్లు, టూర్ ప్యాకేజీలను కూడా బుక్ చేసుకోవచ్చు. అక్బర్ ట్రావెల్స్ అన్ని ప్రాంతాలకు రావుకదా అని మీకు అనుమానం రావచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రైవేటు బస్ ఆపరేటర్లందరితోనూ ఈ సైట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. పైగా.. ట్రావెల్స్ మధ్య టికెట్ రేట్ల తేడాను కూడా మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. అయితే.. www.24gantalu.co.cc ద్వారా క్లిక్ చేసి వెళితేనే లోఫేర్ ఆఫర్ వస్తుందన్న విషయం మర్చిపోకండి.. ఇంకెందుకు ఆలస్యం.. మీ టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి. .


Read more...

పాత టపాలు

 

© 2009 Fresh Template. Powered by Blogger.

Fresh Template by NdyTeeN.